ఏపీ ప్రభుత్వానికి జీఎన్‌ రావు కమిటీ సిఫార్సులు

ప్రజాభిప్రాయం మేరకే తమ నివేదిక ఉంటుందని జీఎన్‌ రావు కమిటీ స్పష్టం చేసింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. అనంతరం కమిటీ సభ్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘రాజధాని, అభివృద్ధి అనే అంశాలపై కమిటీ సభ్యులం అధ్యయనం చేశాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటించాం. ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా నివేదిక ఇచ్చాం.  రాష్ట్రంలో చాలా ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చాలా వెనకబడి ఉన్నాయి. మరి  కొన్ని ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. వీటి మధ్య సమతూకం సాధించాలి. దీని కోసం రెండు అంచెల వ్యూహాన్ని సూచించాం.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. అలాగే నదులు, అడవులు ఉన్నాయి,. అభివృద్ధి వల్ల పర్యావరణం పాడవకుండా సూచనలు చేశాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అభివృద్ధి అంటే పర్యావరణాన్ని పాడు చేసుకోవడం కాదు. అన్ని ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని సూచనలు ఇచ్చాం. వరద ముంపులేని రాజధాని ఉండాలని సూచనలు చేశాం. సుమారు 10,600 కిలోమీటర్లు తిరిగాం. రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేశాం. అంతా ఒకేచోట కాకుండా అందరికీ అన్నీ అనుకూలంగా ఉండేలా సూచనలు చేశాం. సమగ్రమైన పట్టణాభివృద్ధి, ప్రణాళిక కోసం ప్రయత్నించాం. తుళ్లూరు ప్రాంతానికి వరద ముప్పు ఉంది. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రాన్ని నాలుగు రీజియన్‌లుగా విభజించాలని సూచనలు చేశాం.’ అని తెలిపారు.

కమిటీ సిఫార్సులు ఇవే

  • విశాఖలో సచివాలయం, సీఎం క్యాంప్‌ కార్యాలయం
  • విశాఖలో హైకోర్టు బెంచ్‌ కూడా ఏర్పాటు చేయాలి
  • తుళ్లూరులో అసెంబ్లీ సమావేశాలు
  • వేసవిలో అసెంబ్లీ సమావేశాలు విఖాలో నిర్వహించాలి
  • శ్రీబాగ్‌ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకుని కర్నూలులో హైకోర్టు
  • కర్నూలులో హైకోర్టు, ఒక బెంచ్‌ అమరావతిలో, విశాఖలో మరో బెంచ్‌
  • అమరావతిలో రాజభవన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *