వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకంలో మరో కీలకమైన మార్పుకు శ్రీకారం చుట్టారు జగన్. ఉచితంగా ఆపరేషన్లు చేయటమే కాదు.. చికిత్స తర్వాత కోలుకునే సమయంలో కూడా ఆర్థిక సాయాన్ని అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రోజుకు రూ.225 లేదంటే నెలకు రూ.5వేల చొప్పున డబ్బును సాయంగా అందించనున్నారు.
ఏదైనా పెద్ద శస్త్రచికిత్స జరిగిన తర్వాత గతంలో మాదిరి పనులు చేసుకోలేని పరిస్థితి కొంకాలం ఉంటుంది. ఇలాంటి వేళ రెక్కాడితే కానీ డొక్కాడని జీవులకు మేలు జరిగేందుకు వీలుగా కొత్త పథకం ుందని చెప్పాలి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక 48 గంటల్లోపు రోగి బ్యాంకుకు నగదును జమ చేయనున్నారు. ఒకవేళ ప్రభుత్వం చేపట్టిన పథకం అమలు కాకుంటే 104కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏపీ సర్కారు స్పష్టం చేస్తోంది.
ఆరోగ్య శ్రీ సేవలు ఏపీలోని ఆసుపత్రుల్లోనే కాదు.. హైదరాబాద్.. చెన్నై.. బెంగళూరు మహానగరాల్లోని 150కు పైగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అర్హులైన వారికి ఆరోగ్య శ్రీ సేవల్ని సెప్టెంబరు ఒకటి నుంచి అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసింద. మొత్తంగా చూస్తే రాజన్న రెండు అడుగులు వేస్తే.. జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసిన వైనం కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు.
ఇవాల్టి రోజున ఆరోగ్యం కీలకమైన వేళ.. వైద్య సేవల ఖర్చు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో జగన్ సర్కారు ప్రవేశ పెట్టిన తాజా పథకం మరింత మేలు చేస్తుంది. ఈ వినూత్న ఐడియా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాకపోవటం ఒక ఎత్తు అయితే.. సంక్షేమ పథకాల విషయంలో జగన్ దూకుడుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మల్లగుల్లాలు పడేలా చేస్తుందంటున్నారు. ఏమైనా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇబ్బందికి గురి అవుతున్నట్లుగా చెప్పక తప్పదు.