తప్పు చేసిన వారిని శిక్షిస్తే ఎందుకంత బాధ చంద్ర‌బాబూ..?

తాడేపల్లి: ప్రజాసొమ్ము పైసా కూడా వృథా కాకుండా కాపాడుతానని, ప్రజల డబ్బును ఎవరు తిన్నా.. కక్కిస్తానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆనాడే చెప్పారని, చెప్పిన మాట ప్రకారం అవినీతిపై యుద్ధం మొదలుపెట్టారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తప్పును కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు ఎదురుదాడి చేస్తున్నారని, తన వంతు, తన కుమారుడి వంతు వస్తుందని చంద్రబాబుకు భయం పట్టుకుందన్నారు. టీడీపీ హయాంలో అటెండర్‌ నుంచి మంత్రి వరకు అంతా అవినీతిమయమే.. ప్రజల సొమ్ము ఎవరు తిన్నా కక్కిస్తామన్నారు. అవినీతికి కులం, అధికారం ఉంటుందా..? పందికొక్కుల్లా ఎంత తిన్నా వదిలేయాలా..? అని చంద్రబాబును ప్రశ్నించారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సొమ్ముపై బాధ్యత ఉండబట్టే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన టెండర్లలో రూ.2,200కోట్లు ఆదా చేశారని, వెలిగొండ, సోమశిల.. ఇలా ప్రాజెక్టులే కాకుండా.. రూ.100 కోట్లు దాటిన ప్రతి పనిని రివర్స్‌టెండరింగ్‌కు పంపించి వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ఆదా చేశారన్నారు.

తప్పు చేసిన వారికి పోలీసులను చూసినా.. దర్యాప్తు సంస్థలను చూసినా భయం ఉంటుందని, తప్పు చేసిన వారే తప్పింపుచుకునేందుకు సాకులు వెతుకుతారన్నారు. కార్మికుల పొట్టగొట్టిన అక్రమార్కుడు అచ్చెన్నాయుడిని నిన్న అరెస్టు చేశారని, ఈరోజు అభినవ యముడి లాంటి జేసీ సోదరుల్లో ఒకరైన జేసీ ప్రభాకర్‌ను అరెస్టు చేస్తే చంద్రబాబుకు ఏడుపెందుకొస్తుందో అర్థం కావడం లేదన్నారు. అవినీతి పరులు, అక్రమార్కులను అరెస్టు చేయొద్దని చట్టం ఏమైనా ఉందా చంద్రబాబూ..? అని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తే ఎందుకింత బాధ అని నిలదీశారు. ఈ దేశంలోనే అధికంగా దోపిడీకి పాల్పడిన నాయకుడు చంద్రబాబేనన్నారు.

ప్రజా సొమ్ముకాపాడడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్దేశమని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వానివి కక్షసాధింపు చర్యలు అనుకుంటే.. అవినీతిపై మాది కక్షసాధింపే.. దోపిడీ చేసేవారిపై మాది కక్షసాధింపే.. అక్రమాలు చేసే వారిపై మాది కక్షసాధింపే.. అవినీతి, దోపిడీ, అక్రమాలు చేశారో.. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, దీంట్లో కూడా రాజకీయాలు ఉండవన్నారు.తప్పు చేసిన వారిని శిక్షిస్తే ఎందుకంత బాధ చంద్ర‌బాబూ..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *