యావత్ దేశం ఇప్పుడో చిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకోంది. ఓపక్క పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరోవైపు.. మొన్నటివరకూ కరోనా విషయాన్ని హై ప్రయారీటి అన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాలు.. ఇప్పుడు అందుకు భిన్నంగా తమ బాధ్యత నుంచి తప్పుకునేలా వ్యవహరిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళలోనే.. కరోనాతో సహజీవనం తప్పనిసరి అయిన విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ఆంక్షల్ని అంతకంతకూ ఎత్తి వేస్తున్నారు.
దీంతో.. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటివరకూ కేసులు నమోదు కాని ప్రాంతాల్లోకి ఇప్పుడు వైరస్ విస్తరిస్తోంది. దీంతో కొత్త ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అందుకు నిదర్శనంగా ప్రస్తుతం అయోధ్యలోని రామాలయ పూజారికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. కీలకమైన భూమిపూజకు ఐదు రోజుల సమయంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడటంపై ఆందోళ వ్యక్తమవుతోంది.
ఆయోధ్య ఆలయ పూజారికే కాదు..అక్కడ భద్రతా ఏర్పాట్లలో పాలు పంచుకున్న పదిహేను మంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావటం గమనార్హం. అయోధ్య ఆలయంలోని నలుగురు ప్రధాన పూజారుల్లో ఒకరు సత్యేంద్ర దాస్. ఆయన శిష్యుడే తాజాగా పాజిటివ్ గా తేలిన ప్రదీప్ దాస్. ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నారు. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్నది ప్రశ్నగా మారింది. ప్రధాని మోడీతో సహా వీవీఐపీలు.. పలువురు ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి ఇప్పుడు కరోనా భయం పట్టుకున్నట్లు చెబుతున్నారు.