తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగేందుకు ఎంతవరకైనా వెళ్లేది వెళ్లేదే అన్నట్లుగా వ్యవహరించే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలిసారి వెనక్కి తగ్గారు. ఏపీ హైకోర్టు పలుమార్లు చెప్పినా పట్టించుకోని ఆయన.. సుప్రీం మాటను అలానే తీసుకోవటం.. మరోసారి అత్యున్నత న్యాయస్థానం కన్నెర్ర చేసిన నేపథ్యంలో.. మార్గాలు మూసుకుపోవటంతో ఎట్టకేలకు అర్థరాత్రి వేళ జగన్ సర్కారు జీవో జారీ చేసింది. ఏపీ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను పునర్నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో.. నిమ్మగడ్డ విషయంలో జగన్ సర్కారు తాను డిసైడ్ అయిన దారి నుంచి వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పక తప్పదు.
కరోనా కమ్మేస్తున్న వేళ.. స్థానిక సంస్థలకు ఎన్నికలు సరికావంటూ వాయిదా వేస్తూ నిమ్మగడ్డ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సర్కారు ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. ఆయన్ను అనూహ్యంగా పదవి నుంచి తప్పించటం తెలిసిందే. ఏపీ సర్కారు నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిమ్మగడ్డ తర్వాతి కాలంలో సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చింది. సంస్కరణల పేరుతో పదవీకాలానని కుదిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ సర్కారు.. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ కాలం ముగిసిందని పేర్కొంటూ తమిళనాడు నుంచి అత్యవసరంగా రిటైర్డ్ జడ్జి జస్టిస్ కనగరాజ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకోవటం సంచలనంగా మారింది.
దీనిపై పలుమార్లు న్యాయస్థానం ముందుకెళ్లిన నిమ్మగడ్డ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పన్న విషయాన్ని ఫ్రూవ్ చేయగలిగారు. ఈ ఉదంతంపై ఏపీ హైకోర్టు.. సుప్రీంకోర్టు నిమ్మగడ్డను తిరిగి నియమించాలని ఆదేశాలు జారీ చేశాయి. నిమ్మగడ్డను తిరిగి నియమించే విషయంలో పట్టుదలకు వెళ్లిన జగన్ సర్కారు.. చివరకు దారులన్ని మూసుకుపోవటంతో వెనక్కి తగ్గక తప్పలేదు. తాజాగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎస్ ఈసీగా పునరుద్ధరిస్తూ గవర్నర్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేసింది. దానిపై పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గురువారం అర్థరాత్రి వేళలో జీవో జారీ చేశారు. దీంతో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఈ రోజు (శుక్రవారం) బాధ్యతలు స్వీకరించటం ఖాయంగా కనిపిస్తోంది.