ఆయన మాట ఇప్పుడు రాష్ట్రానికి బాట.. ఆయన తెగింపు పేదల కడుపు నింపు.. ఆయన ధైర్యం యువతకు మనోధైర్యం.. ఉద్యమాలే ఊపిరిగా.. జనమే తన హృదయ స్పందనగా.. జనం మెచ్చిన జననేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదిగారు.. ఈ క్రమంలో ఎన్నో చీకటి రాత్రులు గడిపారు. జైలుకు వెళ్లారు. అవమానాలు కత్తిపోట్లు.. వెన్నుపోట్లు అయినా చెక్కుచెదరని ఆయన సంకల్పం చివరకు విజయ తీరాలకు చేర్చింది. అనితర సాధ్యమైన పట్టుదలతో అందరినీ ఎదురించి ఏపీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతమనే చెప్పాలి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 47వ ఒడిలోకి (డిసెంబర్ 21 1972) అడుగుపెడుతున్న సందర్భంగా ఆయనకు ‘తుపాకీ.కామ్’ తరుపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.. ఆయన రాజకీయ జీవితాన్ని ఒక్కసారి తరిచిచూద్దాం..
ప్రజల కోసం.. పార్టీ కోసం అప్పటికే ఎన్నో అప్పులపాలై కాంగ్రెస్ నే నమ్ముకొని పాదయాత్ర చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. 2004లో ఇదే చంద్రబాబును ఓడించి గద్దెనెక్కి ప్రజా సంక్షేమ పాలన ఎలా ఉంటుందో చూపించారు. తండ్రి చాటు బిడ్డగా నాడు రాజకీయ తెరపైకి జగన్ వచ్చారు. మొదట 33 ఏళ్లకే ఇందిరాగాంధీ పీసీసీ అధ్యక్షుడిగా నియామయమయ్యారు. ఆ తర్వాత కడప ఎంపీగా గెలిచారు.
*తండ్రి మరణం.. ఓదార్పుతో యుద్ధం
2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఏపీని శోకసంద్రంలోకి నెట్టింది. వైఎస్ఆర్ మరణం తట్టుకోలేక వందలాది మరణించారు. వారిని ఓదార్చేందుకు కదిలిన జగన్ కు కాంగ్రెస్ అధిష్టానం అడ్డుపడింది. అంతే అక్కడి నుంచి కాంగ్రెస్ తో జగన్ యుద్ధం మొదలైంది. తండ్రిలాగే మాట తప్పని మడమ తిప్పని నైజాన్ని పుణికిపుచ్చుకొని కాంగ్రెస్ ను ఎదురించి జగన్ ఓదార్పుయాత్ర నిర్వహించారు. ఆగ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం జగన్ ను అక్రమాస్తుల కేసు పెట్టించి జైలుకు పంపింది. వైఎస్ఆర్ ఉండగా రాని ఆరోపణలు ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడిపై వచ్చాయంటే దాని వెనుక ఎన్ని కుట్రలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అయినా జగన్ కాంగ్రెస్ కు లొంగలేదు. సంవత్సరన్నర పాటు జైలు జీవితం అనుభవించినా జగన్ తలవంచలేదు.. అదే పోరాట పటిమతో కాంగ్రెస్ ను ఎదురిస్తూ కాంగ్రెస్ పార్టీని స్థాపించి ముందుకు సాగారు..
*వైసీపీ పుట్టుకలో తల్లితోడు..
8 ఏళ్ల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించినప్పుడు జగన్ వెంట ఉన్నది కేవలం ఆయన తల్లి విజయమ్మ మాత్రమే. ఇద్దరితో మొదలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం నేడు 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు గెలుచుకునే స్థాయికి చేరింది. ఇది ఏపీలోనే కాదు దేశంలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచిపోయింది.
*కుట్రలతో 2014లో దక్కని అధికారం
నిజానికి జగన్ ప్రభంజనం 2014లోనే చూసేవాళ్లం. కానీ నాడు విడిపోయిన రాష్ట్రానికి బీజేపీ అండ అవసరం అని జతకట్టిన బాబును జనాలు గెలిపించారు. దీంతో జగన్ విజయం అంచున చతికిలపడాల్సిన పరిస్థితి ఎదురైంది. అయినా మొక్కవోని ధైర్యం పట్టుదలతో 2019వరకూ సాగారు. తండ్రికి సమానమైన నేతలతో ఢీకొట్టారు. కోడి కత్తితో పొడిపించినా.. బాబాయ్ హత్య జరిగినా చెలించకుండా మొండి పట్టుదలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లారు జగన్. రోజురోజుకు రాటుదేలుతూ స్వతంత్ర భావాలతో ముందుకుసాగారు.
*గతిని మార్చిన పాదయాత్ర
దేశంలో ఏ రాజకీయ సాహసించని విధంగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు జగన్ చేసిన 3600 కిలోమీటర్ల పాదయాత్రనే ఆయనను ప్రజలకు చేరువ చేసింది. ప్రజానాడిని పసిగట్టేలా చేసింది. అధికారం దక్కేలా చేసింది.
*తండ్రిని మించిన తనయుడు
మాట తప్పని నైజం తండ్రి నుంచి నేర్చుకున్న జగన్ తాను అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తానన్నాడు. వైఎస్ఆర్ అమలు చేసిన ఆరోగ్యశ్రీ ఫీజు రీయింబర్స్ రైతు రుణమాఫీ ఆసరా ఫించన్లు సహా అన్నింటిని అంతకంటే మెరుగ్గా నవరత్నాలను తెచ్చి అమలుచేస్తూ తండ్రిని మించిన తనయుడిగా ఎదిగిపోతున్నారు. తండ్రి కూడా సాహసించని ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం ఆర్టీసీ విలీనం నిర్ణయాలను తీసుకుంటూ ప్రజల మదిలో చిరగని ముద్ర వేస్తున్నారు. దిశా చట్టం అమలు మూడు రాజధానులు లాంటి గట్స్ కలిగిన నిర్ణయాలను తీసుకొని తండ్రిని మించిన పాలన దురంధరుడిగా పేరు తెచ్చుకున్నారు. ధైర్యానికి సాహసానికి పట్టుదలకు ప్రతీకగా నిలుస్తున్న 47 ఏళ్ల ఏపీ యువ సీఎం వైఎస్ జగన్ మరెన్నో ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. తుపాకీ.కామ్ తరుఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.