అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడి భూములు దక్కించుకున్న కొందరు టీడీపీ నేతలు, వారి బినామీల పేర్ల జాబితాను తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసి సంచలనం సృష్టించింది. వీరంతా నిబంధనలు తుంగలో తొక్కి రాజధాని ఏర్పాటుకు ముందే వేలాది ఎకరాలను కారుచౌకగా రైతులనుంచి కొని కోట్లకు పడగలెత్తారని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.
ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను కూడా అతి తక్కువ ధరకు ప్రభుత్వం ల్యాండ్ ఫూలింగ్ పేరుతో సేకరించింది. వాటినే టీడీపీ నేతలకు పందేరం చేసినట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది.
ఇక ఇన్ సైడర్ ట్రేడింగ్ లో భూములు కొన్న వారిలో టీడీపీ నేతల బినామీలే ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. తెల్లరేషన్ కార్డుదారులకు కూడా ఇక్కడ వందలాది ఎకరాలు ఉన్నట్టు తేలింది. టీడీపీనేతల కారు డ్రైవర్లు, పనిమనుషుల పేర్లపై కూడా భూములున్నాయని జగన్ సర్కారు నివేదికలో తేల్చింది.
తాజాగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఇన్ సైడర్ ట్రేడింగ్ జాబితాలో మొత్తం 11 మంది పేర్లు ఉన్నట్టు సమాచారం. ఇందులో టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా లింగమనేని రమేశ్, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ , యనమల అల్లుడు పుట్టా మహేష్ యాదవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్ రావు పేర్లతోపాటు చాలా మంది పేర్లు ఉన్నట్టు సమాచారం. ఈ ఇన్ సైడర్ ట్రేడింగ్ పై త్వరలోనే సీబీఐ విచారణకు ఏపీ సర్కారు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.