ఏపీ రాజధాని అమరావతిపై సీఎం జగన్ సర్కారు తేల్చేసింది. ఎన్నివేల కోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధిని చేయలేమని స్వయంగా సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ లో మంత్రులకు వివరించినట్లు సమాచారం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నాని విలేకరులతో వివరాలు వెల్లడించారు. సుమారు 4వేలకు పైగా ఎకరాల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తెలిపారన్నారు. రాజధాని తరలింపుపై తొందరలేదని జగన్ చెప్పారని తెలిపారు.
అమరావతిలో పెట్టే ఖర్చులో 10శాతం ఖర్చు చేసినా కూడా విశాఖపట్నంను హైదరాబాద్ లా అభివృద్ధిని చేసే అవకాశం ఉందని జగన్ అభిప్రాయపడినట్టుగా మంత్రి నాని తెలిపారు. రాజధాని మార్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ తెలిపారన్నారు.
అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే టీడీపీ నేతలు, వారి డ్రైవర్లు, బంధువులు పెద్ద ఎత్తున భూములు కొన్నారని.. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త కానీ సీబీఐతో కానీ విచారణ జరుపాలని కేబినెట్ నిర్ణయించిందని మంత్రి నాని సంచలన ప్రకటన చేశారు. అందరి పాపం పండే రోజు వచ్చిందని నాని తెలిపారు. వారు సవాల్ చేసిందే జరగబోతోందని హెచ్చరించారు.
చంద్రబాబు అమరావతి కోసం 5400వేల కోట్లు చెచ్చి కొట్టాడని.. ఇందులో కేంద్రం 1500 కోట్లు ఇచ్చిందని మంత్రి నాని తెలిపారు. లక్ష 10వేల కోట్లు పెట్టి అమరావతి కడితే దాని అప్పులు ఎవరు తీర్చాలని నాని ప్రశ్నించారు. ఇప్పటికే బాబు తెచ్చిన 5వేల కోట్లకు వడ్డీ 500 కోట్లు కడుతున్నామని.. లక్ష కోట్లు తెస్తే ఏపీ ఎంత అప్పు చెల్లించాలని నాని ప్రశ్నించారు.
మంత్రి నాని వ్యాఖ్యలను బట్టి అమరావతిని జగన్ సర్కారు పూర్తిగా పక్కన పెట్టేసి అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి సారించబోతోందని అర్థమవుతోంది. విశాఖలో పరిపాలన కేబినెట్ ఏర్పాటు చేయబోతోందని తెలుస్తోంది.