సినిమా వాళ్లను జీఎస్టీ అధికారులు విడిచిపెట్టేట్టు లేరు. వరుస దాడులతో ఊపిరాడనివ్వడం లేదు. ఇండ్లు.. కార్యాలయాలు.. ఏవీ విడిచిపెట్టడం లేదు. దీంతో స్టార్స్ కి కొత్తగా జీఎస్టీ పంచ్ ఒణుకు పుట్టిస్తోంది. తాజాగా ముగ్గురు సెలబ్రిటీలపై జీఎస్టీ అధికారులు దాడులు నిర్వహించడంతో టాలీవుడ్ వర్గాల్లో మరోసారి ఒణుకు మొదలైంది. అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి జీఎస్టీ అధికారులు శుక్రవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నివాసంలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు ఈ దాడుల్ని నిర్వహించారు. లావణ్యతో పాటు జబర్దస్త్ యాంకర్ కం నటి అనసూయ.. అలాగే సీనియర్ యాంకర్ సుమ ఇళ్లలోనూ జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.
చిట్ ఫండ్ కంపెనీలు.. కోల్డ్ స్టోరేజీలు.. సాఫ్ట్ వేర్ కంపెనీలు.. కన్ స్ట్రక్షన్ కంపెనీలతో పాటు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ లోనూ వీరు పెట్టుబడులు పెట్టినా సకాలంలో పన్ను చెల్లించలేదని.. జీఎస్టీ ఎగవేసారని అందుకే ఈ దాడులు నిర్వహించారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై సదరు యాంకర్లు స్పందించాల్సి ఉంటుంది. సామాజిక మాధ్యమాల ప్రచారంలో నిజం ఎంత? అన్నది వారే రంగంలోకి దిగి క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.