శుక్రవారం రిలీజైన కొత్త సినిమాల్లో ఒకదానికి మాత్రం టాక్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఏమీ లేవు. ఆ సినిమానే.. రూలర్. ఈ సినిమా చెత్త అనే విషయంలో అందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కెరీర్లోనే అత్యంత పేలవమైన సినిమాల్లో ఇదొకటిగా నిలుస్తుందనడంలో మరో మాట లేదు. సినిమా రిజల్ట్ విషయంలో కూడా ఎవరికీ ఏ సందేహాలూ లేవు. బాలయ్య అభిమానులు సైతం భరించలేని స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దాడు తమిళ సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్. సినిమాలో ఏం బాలేదని అడిగితే.. చాంతాడంత లిస్టు తయారవుతుంది. ఏం బావుందంటే మాత్రం చెప్పడానికి కష్టపడాల్సిందే.
ఐతే సినిమాలో ఉన్న రెండే రెండు పాజిటివ్స్.. బాలయ్య చేసిన డ్యాన్సులు ఫైట్లు. యాక్షన్ ఘట్టాలంటే ఏ సినిమాలో అయినా ఒకేలా ఉంటాయి. దాని క్రెడిట్ హీరో కంటే ఫైట్ మాస్టర్లకే ఎక్కువగా వెళ్లిపోతుంది. వాటిని ఎంజాయ్ చేసే ప్రేక్షకులు కూడా తక్కువే. డ్యాన్సుల విషయానికొస్తే అభిమానులకు అదిచ్చే హుషారే వేరు. అయితే ఆరు పదుల వయసున్న బాలయ్య రూలర్ సినిమాలో చేసిన డ్యాన్సులు చూస్తే షాకవడం ఖాయం. యువ కథానాయకులకు ఏమాత్రం తీసిపోని స్పీడుతో.. గ్రేస్తో బాలయ్య ఔరా అనిపించేశాడు. ముఖ్యంగా పడతాడు తాడు.. అనే పాటలో అయితే బాలయ్య స్టెప్స్ షాకింగే. అవి శుక్రవారం మధ్యాహ్నం నుంచే సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం మొదలుపెట్టాయి. ఈ వయసులో బాలయ్య చూపించిన ఎనర్జీకి ఎవ్వరైనా షాకవ్వాల్సిందే.