ఆంధ్రప్రదేశ్ ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు అవినీతిపై మరో యుద్ధం ప్రకటించారు. ఈసారి ఆయన రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై పడ్డారు. శుక్రవారం ఉదయం నుంచి ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి.
ఇటీవలే సీఎం వైఎస్ జగన్ ఏసీబీ సమీక్షలో భాగంగా ప్రజల నుంచి అందుతున్న వేల ఫిర్యాదు రెవెన్యూశాఖపైనేనని.. అవినీతితో రెవెన్యూ శాఖ పంకిలమైందని.. ఏపీ రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీరియస్ అయ్యారు. ఏపీలో అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించాలని ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులును ఆదేశించారు.
దీంతో ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన సింగం లాంటి ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు తాజాగా శుక్రవారం సీఎం జగన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగారు. ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులతో దాడులు చేయించారు.
రెవెన్యూ కార్యాలయాల్లో జరిగే అవినీతిపై సీఎం ఆదేశాలతోనే ఏసీబీ ఫోకస్ చేసింది. ఇప్పటికే అంతులేని అవినీతి ఉన్నట్టు గుర్తించి వెలికి తీస్తోంది.
ఇక శుక్రవారం ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులు స్వయంగా సీఎం జగన్ ను కలిశారు. రెవెన్యూ కార్యాలయాలపై దాడులపై సీఎం జగన్ కు వివరిస్తున్నారు.
ఆర్టీఏ కమిషనర్ గా మొదట బాధ్యతలు చేపట్టిన ఐపీఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు రాయలసీమకు చెందిన మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన అక్రమంగా నడుస్తున్న దివాకర్ ట్రావెల్స్ ఆటకట్టించాడు. జేసీ బస్సులను సీజ్ చేసి సంచలనం సృష్టించాడు. కోడెల శివప్రసాద్ అక్రమాలను బయటపెట్టి రికవరీ చేయించారు.
ఇప్పటికే ఇదే సీతారామాంజనేయులు ఏసీబీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై సీఎం జగన్ ఆదేశాల మేరకు దాడులు చేసి కలకలం సృష్టించారు. ఇలా సీఎం జగన్ నమ్మిన బంటుగా సింగం లాంటి ప్రభుత్వ ఆఫీసరుగా సీతారామాంజనేయులు ఏపీలో అవినీతిపై యుద్ధం ప్రకటించారు.