ప్రపంచంలోనే అద్భుతాన్ని ఆవిష్కరించిన ‘మేఘా’

గోదావరి దారి మళ్లింది. ఏకంగా 300 మీటర్లు ఎదురెక్కింది. ఎక్కడి కాళేశ్వరం ఎక్కడి సిరిసిల్ల.. గోదావరి నీటిని అంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలంగాణలోని కేటీఆర్ నియోజకవర్గ కేంద్రాన్ని గోదావరి నీటితో పునీతం చేసింది ‘మేఘా’. తెలంగాణ కరువును తీర్చే కాళేశ్వరం ప్రాజెక్టులో మహా అద్భుతాన్ని ఆవిష్కరించింది  మేఘా ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (మేఘా‌) సంస్థ.

అనితర సాధ్యం కాని వేగంతో కాళేశ్వరంను కేవలం మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేసి ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచిన మేఘా సంస్థ తాజాగా  కాళేశ్వరం నీటిని దాదాపు 300 మీటర్ల ఎగువకు నీటిని మళ్లించి ప్రపంచ రికార్డును  కొల్లగొట్టింది.. ప్రపంచ నీటి పారుదల చిత్రపటంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ద్వారా  మేఘా సంస్థ ఈ అద్భుతం సాధించింది.

* పట్టిసీమ, హంద్రీనీవాను మించి కాళేశ్వరం

ఇప్పటివరకు దేశంలోనే కాదు ఆసియాలో పెద్దదిగా పరిగణించే హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకం ఏడాది మొత్తం పంపింగ్‌ చేస్తే దాదాపు గరిష్టంగా 18 టిఎంసీల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. అదే విధంగా పట్టిసీమ ఎత్తిపోతలపథకం ద్వారా కూడా ఏడాది మొత్తం సరాసరిన 10 టిఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణకు తరలిస్తున్నారు. తాజాగా 300 మీటర్ల ఎగువన ఉన్న సిరిసిల్లా జిల్లా కేంద్రానికి సమీపంలోని మిడ్‌మానేరు జలాశయానికి దాదాపు 25 టిఎంసీల నీటిని అనతికాలంలోనే ఎత్తిపోయడంలో మేఘా పంపింగ్‌ స్టేషన్లు కీలకభూమికను నిర్వహించాయి. ఈ మూడు ప్రాజెక్ట్‌లను కూడా మేఘా ఇంజనీరింగే నిర్మించడం గమనార్హం.

20 రోజుల్లోనే 25 టీఎంసీలతో రికార్డ్

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి పంపింగ్ మొదలైన కేవలం 20 రోజుల్లోనే 25 టీఎంసీల సామర్థ్యం గల మిడ్ మానేరు జలాశయాన్ని నింపి మేఘా మహా అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఒక రోజుకు ఏకంగా 2 టీఎంసీల నీటిని పంప్ చేయడం.. మధ్య జలశయాల్లో నిల్వ చేయడం.. మళ్లీ పంప్ చేయడం మేఘా ఇంజినీరింగ్ వ్యవస్థ రికార్డ్ గా చెప్పవచ్చు.

పంపింగ్ లో మేఘా రికార్డ్

కాళేశ్వరం ప్రాజెక్టులో మొదటిది లక్ష్మీ పంప్ హౌస్. ఇక్కడి నుంచి మొదట గోదావరి ప్రవాహాన్ని ఎగువకు పంపింగ్ చేస్తారు. ఈ ఏడాది జులై 5 నుంచి డిసెంబర్‌ 6 తేది వరకు 24.062 టిఎంసీల నీటిని  మేఘా కంపెనీ ఎత్తిపోయడం అద్భుతమైన విషయంగా చెప్పవచ్చు.

ఇక అదే విధంగా లక్ష్మీపైన గోదావరిపై ఉన్న సరస్వతి పంప్‌హౌస్‌లో ఒక్కొక్కటి 40 మెగావాట్ల సామర్థ్యంతో 8 మిషన్లను మేఘా సంస్థ ఏర్పాటు  చేసింది. ఇక్కడ మొత్తం అన్ని పనిచేయడం ప్రారంభించగా ఈ ఏడాది జులై 22 నుంచి డిసెంబర్‌ 6 వరకు 1781 గంటల పాటు పంపింగ్‌చేసి 18.559 టిఎంసీల నీటిని ఎగువకు మళ్లించారు.

ఇక మూడో పంపింగ్ కేంద్రమైన  లింక్‌-1లో చివరిదైన పార్వతి పంపింగ్‌ కేంద్రం నుంచి ఇప్పటి దాకా 1639 గంటలు మిషన్లను పనిచేయించి 15.404 టిఎంసీల నీటిని శ్రీపాదసాగర్‌ ఎల్లంపల్లి జలాశయానికి చేర్చారు.

ఇక ప్రపంచంలోనే  అతిపెద్దది  బాహుబలి మోటార్లు కొలువైన  లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌస్ 430 మీటర్ల లోతున భూగర్భంలో నిర్మించారు. 139 మెగావాట్ల సామర్థ్యం గల 7 భారీ మోటార్ల ద్వారా ఇప్పటిదాకా 2602 గంటల పాటు పనిచేయగా 29.70 టిఎంసీల నీటిని మిడ్‌మానేరు వైపు తరలించింది. సిరిసిల్లా సమీపంలోని మిడ్‌మానేరు జలాశయం తొలిసారిగా గోదావరి జలాలతో కళకళలాడే చేసి మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసింది. కేటీఆర్ కు ప్రజల నుంచి అభినందనలు దక్కేలా చేసింది.

గోదావరికే కొత్త నడకనేర్పి తెలంగాణను సస్యశ్యామలం చేసిన మేఘా ఇలా గోదావరికి మేఘా కొత్త నడకను నేర్పింది. నీరు పళ్ళమెరుగనే సామేతను తిరగ రాసింది.గోదావరి దశ-దిశను మార్చివేయడంలో మేగా అద్భుతమైన ప్రగతిని సాధించి తెలంగాణ కరువును తీర్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టుదలకు , మేఘా ఇంజనీరింగ్‌ నిపుణుతకు  గోదావరి కూడా రూటు మార్చుకొని తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు ఏకంగా  160 కిలోమీటర్ల ఎగువకు ప్రయాణించింది. ఈ అద్భుతాన్ని సుసాధ్యం చేయడంలో మేఘా పాత్ర ఎనలేనిది. ఇసుకతో ఎడారిని తలపించే గోదావరి సిరిసిల్ల మానేరు వాగును సంవత్సరం పాటు నీటి కళతో నింపి తెలంగాణ సమాజానికి మేఘా గొప్ప వరమిచ్చింది. పంపింగ్ లో రికార్డులు తిరగరాస్తూ జయహో మేఘా అనేలా చేసింది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *