మెగా మల్టీస్టారర్ కి అదే అసలు సమస్య!

మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ ఎపుడు?  చిరంజీవి- పవన్ కల్యాణ్ కాంబినేషన్.. పవన్ కల్యాణ్ – రామ్ చరణ్ కాంబినేషన్.. లేదా చిరు-పవన్-చరణ్ కాంబినేషన్ .. ఇలా ఏవైనా ప్లాన్స్ ఉన్నాయా? అంటే .. ఇది ఆలోచన వరకూ ఓకే కానీ ఆచరణలో మాత్రం అసలు సాధ్యం కావడం లేదు. ఏదో చిరు కోసం చరణ్ … చరణ్ కోసం చిరు అతిధి పాత్రల్లో తళుక్కుమనడానికి మినహా పూర్తి స్థాయి సినిమా చేయడానికి ఇంతవరకూ ఏ దర్శకనిర్మాతా సాహసించలేదు. కథ- స్క్రిప్ట్ లేకుండా చేసిన ప్రకటనలేవీ నిలబడలేదు.. ఏదీ నిజం కాలేదు. చిరు-పవన్ ని కలిపి సినిమా తీసేందుకు టీఎస్సార్..అశ్వనిదత్ లాంటి వాళ్లు ప్రయత్నించినా అదేదీ సాధ్యపడలేదు. దానికి కారణం స్క్రిప్టు లేకపోవడమే.

చిరు- చరణ్ కాంబినేషన్ కూడా ఇంతవరకూ కుదరనేలేదు. ఇక మెగా ఫ్యామిలీ యువహీరోలతో మల్టీస్టారర్లు తీసేందుకు అల్లు అరవింద్ సన్నాహాలు చేస్తున్నారన్న ప్రచారం ఇటీవల సాగింది. అయితే అధికారికంగా ఇంకా పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టేస్తున్నాం.. అంటూ ఏ ప్రకటనా రాలేదు. గతంలో  మెగా ఫ్యామిలీలో చిరంజీవి-నాగబాబు కలిసి నటించారు. చరణ్ హీరోగా నాగబాబు సినిమా తీశారు .. కానీ ఇటీవలి కాలంలో మెగా మల్టీస్టారర్ ప్రయత్నం అయితే ఆ కాంపౌండ్ లో ఏదీ చేయనేలేదు.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ ను స్థాపించి `సర్ధార్ గబ్బర్ సింగ్`.. `ఛల్ మోహన్ రంగా` లాంటి సినిమాల్ని నిర్మించినా ఇతర మెగా హీరోలతో సినిమాలేవీ చేయలేదు. అయితే చరణ్ రెడీగా ఉంటే సినిమా తీస్తానని ఇంతకుముందు పవన్ ఓసారి ప్రకటించారు. అయితే అది కూడా అధికారికంగా కన్ఫామ్ కాలేదు. తాజా ఇంటర్వ్యూలో పవన్ మరోసారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. “రామ్ చరణ్ తో సినిమా త్వరలోనే ఉంటుంది. సరైన కథతో ఏ దర్శకుడైనా వస్తే సినిమా చేస్తాను“ అని అన్నారు. అలాగే పవన్ రెడీగా ఉంటే సినిమా నిర్మించేందుకు కొణిదెల సంస్థ సిద్ధమేనని చరణ్ – చిరు బృందం ఇంతకుముందు ప్రకటించారు. కానీ అందుకు దర్శకుడు లేడు.. స్క్రిప్టు అసలే లేదు.

దీనిని బట్టి మెగా మల్టీస్టారర్లకు అసలు సమస్య స్క్రిప్టు. సరైన కథ రాసుకుని ఒప్పించగలిగే మొనగాడైన దర్శకుడే లేడని భావించాల్సి వస్తోంది. మెగా కాంబినేషన్ సినిమాలకు ఇంతవరకూ ఏ దర్శకుడు సరైన కథల్ని తేలేకపోయారని ప్రూవైంది. అక్కినేనీస్.. మంచూస్.. దగ్గుబాటీస్ చేసినంత ఈజీగా మెగా మల్టీస్టారర్ కుదరకపోవచ్చేమో!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *