అర్జున్ సురవరం మూవీ రివ్యూ

ఏడాది కిందటే విడుదలకు సిద్ధమై.. వాయిదాల మీద వాయిదాలు పడ్డ సినిమా ‘అర్జున్ సురవరం’. యువ కథానాయకుడు నిఖిల్ సిద్దార్థ ప్రధాన పాత్రలో తమిళ దర్శకుడు టి.ఎన్.సంతోష్ రూపొందించిన చిత్రమిది. తమిళ హిట్ ‘కనిదన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సినిమా నిఖిల్ కు ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉందో చూద్దాం పదండి.

కథ:

అర్జున్ సురవరం (నిఖిల్) ఒక టీవీ ఛానెల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. తన తండ్రికి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తన్నట్లు చెప్పి ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా టీవీ ఛానెల్లో పని చేస్తుంటాడు. బీబీసీలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా చేరాలన్న తన లక్ష్యానికి అడుగు దూరంలో నిలిచిన అర్జున్.. అనూహ్యంగా ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణంలో చిక్కుకుని అందరి దృష్టిలో ఒక మోసగాడిగా – నేరగాడిగా ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది. ముందు ఏం జరుగుతోందో తెలియక అయోమయానికి గురైన అర్జున్.. ఆ తర్వాత తన జర్నలిస్టు బుర్రను బయటికి తీస్తాడు. ఈ కుంభకోణం వెనుక సూత్రధారులెవరో కనిపెట్టడానికి సిద్ధపడతాడు. అతడి ప్రయత్నం ఏమేరకు ఫలించింది.. ఈ కుంభకోణం వెనుక ఉన్నదెవరు.. వాళ్లను దోషులుగా నిలబెట్టి అర్జున్ ఎలా బయటపడ్డాడు అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

కథాంశం ఏదైనా.. అందులో కమర్షియల్ హంగులు కచ్చితంగా ఉండాలని భావిస్తారు కొందరు ఫిలిం మేకర్స్. తమిళంలో హిట్ అయిన ‘గణిదన్’ సినిమాను ఇదే తరహాలో నడిపించాడు కొత్త దర్శకుడు టి.ఎన్.సంతోష్. యూత్ కనెక్టయ్యే ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణం చుట్టూ కథను అల్లి.. ఉత్కంఠ రేపేలా కథనాన్ని నడిపిస్తూనే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ.. కమర్షియల్ హంగులూ ఉండేలా చూసుకున్నాడు. ఇదే దర్శకుడు తెలుగులోకి ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తూ.. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు ఇంకాస్త మసాలా జోడించే ప్రయత్నం చేశాడు. ఐతే మూల కథ ఆసక్తికరంగా ఉన్నా.. అక్కడక్కడా ఉత్కంఠ రేపేలా కథనాన్ని నడిపించినా.. దీన్ని సగటు కమర్షియల్ సినిమాల తరహాలోనే డీల్ చేయడంతో ‘అర్జున్ సురవరం’ ఒక మిశ్రమ అనుభూతిని కలిగిస్తుంది. విషయం ఉన్న కథే అయినప్పటికీ.. దాన్ని సరిగా డీల్ చేయకపోవడంతో ‘అర్జున్ సురవరం’ మామూలు సినిమాగా మిగిలిపోయింది.

తన ప్రమేయం లేకుండా ఒక పెద్ద కుంభకోణంలో చిక్కుకున్న హీరో.. దీన్నుంచి బయటపడటం కోసం పరిశోధన మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఒక సీరియస్ సాంగ్ వస్తుంది. ఒక సర్టిఫికెట్ తయారీలో ఎన్ని కోణాలుంటాయో వివరిస్తూ ఒక లాయర్ తన చేతిలో ఉన్న సర్టిఫికెట్ ‘పర్ఫెక్ట్’ అని చెబుతాడు. అంతలోనే అతడి అసిస్టెంట్ అయిన లేడీ లాయర్ అక్కడికి వస్తే.. హీరో స్నేహితుడైన వెన్నెల కిషోర్.. ‘అవును పర్ఫెక్ట్ ఫిగర్.. 36 – 24 – 36’ అంటూ ఆమె కొలతలు చెబుతాడు. అదే పాటలో ఇంకో చోట తాను 20 ఏళ్లపుడు అచ్చం ప్రభాస్ లా ఉండేవాడినంటాడు కిషోర్. నిజానికి ఈ పాట ప్రేక్షకుల్ని సీరియస్ గా కథలో ఇన్వాల్వ్ చేయడానికి ఉద్దేశించింది. కానీ మధ్య మధ్యలో ఈ కామెడీ పంచుల్ని ఇరికించారు. ఆ పంచులు మామూలుగా చూస్తే నవ్వించేవే. కానీ అవి ఎలాంటి సందర్భంలో వచ్చాయన్నది ఇక్కడ ప్రధానమైన విషయం. హీరో తన పని తాను చేసుకుపోతుంటే చాలు.. అతడి పాత్ర ఎలివేట్ అయ్యే అవకాశం ఉన్న కథ ఇదైనప్పటికీ.. అనవసర బిల్డప్స్ ఇవ్వడం.. అవసరానికి మించి యాక్షన్ సీక్వెన్సులు పెట్టడం కూడా ‘అర్జున్ సురవరం’లో బిగిని తగ్గించింది.

‘అర్జున్ సురవరం’కు సంబంధించి పెద్ద ప్లస్ పాయింట్.. ఫేక్ సర్టిఫికెట్ల మాఫియా చుట్టూ కథను అల్లడం. కంటెంటపరరీగా అనిపించే ఈ పాయింట్ తో మెజారిటీ ప్రేక్షకులు రిలేట్ అవుతారు. కాకపోతే దీన్ని మరీ పెద్దది చేసి.. నమ్మశక్యం కాని విధంగా చూపించడం మైనస్. తొలి 20 నిమిషాల్లో చాలా మామూలుగా సాగిపోయే సినిమా.. ఈ పాయింట్ మీద అసలు కథను మొదలుపెట్టాక ఆసక్తి రేకెత్తిస్తుంది. తనకు తెలియకుండా ఈ కుంభకోణంలో హీరో పీకల్లోతు మునిగిపోవడంతో ఈ పద్మవ్యూహం నుంచి హీరో ఎలా బయటపడతాడనే ఆసక్తి.. తర్వాత ఏం జరుగుతుందన్న ఉత్కంఠ మొదలవుతుంది. విలన్ పాత్రను పరిచయం చేసిన తీరు.. ఈ కుంభకోణం తాలూకు వివరాలు వెల్లడించిన వైనం ఆసక్తి రేకెత్తిస్తాయి. వెన్నెల కిషోర్ ను ఎరగా వేసి విలన్ గుట్టు బయటికి లాగేందుకు హీరో వేసే ఎత్తు.. ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తాయి. ద్వితీయార్ధం చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందన్న అంచనాలు కలిగేలా ఇంటర్వెల్ దగ్గర సెటప్ బాగా కుదిరింది.

ఐతే సెకండాఫ్ మాత్రం అంచనాలకు తగ్గట్లు లేకపోయింది. హీరో-విలన్ మధ్య టామ్ ఎండ్ జెర్రీ గేమ్ అస్సలు పండలేదు. మొదట్లో ఆసక్తికరంగా అనిపించే ఫేక్ సర్టిఫికెట్ల కుంభకోణాన్ని ఆ తర్వాత మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించడం.. విలన్ టీం ఈ మాఫియాను నడిపించే తీరు నమ్మశక్యంగా లేకపోవడం.. చాలా వరకు సన్నివేశాలు లాజిక్ కు దూరంగా నడవడంతో ప్రేక్షకులు నెమ్మదిగా ఈ వ్యవహారంతో డిస్కనెక్ట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. విలన్ డెన్లోకి వెళ్లి హీరో చేసే సాహసాలు పర్వాలేదనిపించినప్పటికీ.. ఆ ఎపిసోడ్ మరీ సుదీర్ఘంగా సాగడంతో.. ఒక దశ దాటాక సినిమా ఎప్పుడు ముగుస్తుందా అన్న భావన కలుగుతుంది.  హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ కానీ.. కామెడీ సన్నివేశాలు కానీ.. సినిమాలో అసలు సింక్ కాలేదు. అవి కేవలం ఫిల్లింగ్ కోసమే ఉపయోగపడ్డాయి. యాక్షన్ ఘట్టాల వరకు మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తాయి. ఓవరాల్ గా చెప్పాలంటే.. ‘అర్జున్ సురవరం’లో ఆసక్తి రేకెత్తించే కథ ఉంది. కానీ కథనం అనుకున్నంత బిగితో లేదు. ఒకసారి చూసేందుకు తగ్గ స్టఫ్ ఉన్నప్పటికీ.. ‘అర్జున్ సురవరం’ ప్రత్యేకమైన అనుభూతినైతే కలిగించదు.

నటీనటులు:

అర్జున్ పాత్రకు నిఖిల్ న్యాయం చేశాడు. ఆలోచన.. ఆవేశం ఉన్న ఈ పాత్రను నిఖిల్ ఓన్ చేసుకుని నటించాడు నిఖిల్ గత సినిమాలతో పోలిస్తే ఇందులో  హీరోయిజం ఎక్కువగా కనిపిస్తుంది. ఫిజిక్ సహా అన్నీ మార్చుకుని పాత్రలో ఫిట్ అయ్యే ప్రయత్నం చేశాడు నిఖిల్. కొన్ని సన్నివేశాల్లో నిఖిల్ చూపించిన ఇంటెన్సిటీ పాత్ర బలాన్ని పెంచింది. హీరోయిన్ లావణ్య త్రిపాఠిది నామమాత్రమైన పాత్ర. విలన్ పాత్రలో తరుణ్ అరోరా మొదట భయపెడతాడు కానీ.. ఆరంభంలో ఆ పాత్రకు ఇచ్చిన బిల్డప్ కు తగ్గట్లు తర్వాత అది లేకపోవడం మైనస్ అయింది. వెన్నెల కిషోర్ ఓ మోస్తరుగా నవ్వులు పంచాడు. సత్య కూడా బాగానే చేశాడు. పోసాని నాగినీడు రాజా రవీంద్ర ప్రగతి పర్వాలేదు.

సాంకేతికవర్గం:

సామ్ సి.ఎస్. పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం సినిమాకు ఆకర్షణగా నిలిచింది. కథనంలో ఉత్కంఠ పెంచడంలో బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. సూర్య ఛాయాగ్రహణం కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. దర్శకుడు టి.ఎన్.సంతోష్ ఎంచుకున్న కథ ఆసక్తికరమైందే. యువత ఈజీగా రిలేటయ్యే సర్టిఫికెట్ల కుంభకోణం చుట్టూ కథను అల్లడం ప్లస్ పాయింట్. ఆరంభంలో మామూలుగా అనిపించినా.. అసలు కథ మొదలయ్యాక కొంత వరకు స్క్రీన్ ప్లే రేసీగా ఉండేలా చూసుకున్నాాడు కానీ.. ఆ తర్వాత పూర్తిగా పట్టు తప్పాడు. దర్శకుడిగా అతడికి యావరేజ్ మార్కులు పడతాయి.

చివరగా: అర్జున్ సురవరం..మంచి కాన్సెప్టే కానీ..!

రేటింగ్-2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *