ఒకవైపు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యరహిత సమాజాన్ని నిర్మించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా ఏపీలో మద్యం దొరకడం దుర్లభమైన పరిస్థితి. మద్యపనాన్ని ప్రేమించే సామాన్యులు డబ్బులిచ్చినా కోరుకున్న మద్యం దొరకక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ విషయంపై స్పందించమంటే.. ప్రభుత్వం మద్య రహిత సమాజం అంటూ నీతులు చెబుతుంది.
అయితే ఆ నీతులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ల కుటుంబ సభ్యులకు వర్తించవా? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయిప్పుడు. ఈ ప్రశ్నలకు ఆస్కారం ఇస్తున్నదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే కావడం గమనార్హం. వైఎస్ జగన్ కేబినెట్ లో మంత్రి అయిన ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తమ్ముడు పత్రికలకు ఎక్కిన తీరుతో ఈ ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
బొత్స సత్తిబాబు తమ్ముళ్లలో ఒకరైన బొత్స శ్రీనివాసరావు ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఆయన నీటి పారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పని చేస్తూ ఉన్నారు. విశాఖ డివిజన్లో ఆయన పని చేస్తూ ఉన్నారు.
వారి అన్నగారు మంత్రి కావడం, తమ కుటుంబానికి రాజకీయంగా పలుకుబడి ఉండటం, అందునా తామున్న పార్టీ అధికారంలో ఉండటంతో తనకు ఎదురులేనట్టుగా భావించినట్టుగా ఉన్నారు బొత్స శ్రీనివాసరావు. ఈ క్రమంలో ఆయన ఏకంగా తన కార్యాలయాన్నే బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చేసుకున్నారు. అక్కడే బెడ్ కూడా ఏర్పాటు చేసుకుని.. ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని తన విందులకు, తన పవళింపులకు వేదికగా మార్చుకున్నారు. ఈ తీరుతో ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అందుకు సంబంధించి తెలుగుదేశం అనుకూల మీడియా ఫొటోలను కూడా పబ్లిష్ చేసేసింది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఎక్కడ దొరుకుతారా.. అని టీడీపీ మీడియా ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో బొత్స శ్రీనివాసరావు రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో ఆ ఫొటోలను పతాక శీర్షికలకు ఎక్కించింది టీడీపీ మీడియా.
విశాఖ జడ్పీ కూడలిలోని నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయాన్ని బొత్స శ్రీనివాసరావు హోటల్ గదిలా మార్చేసుకున్న వైనాన్ని ఒక పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. ఆయన కార్యాలయాన్ని తన పార్టీలకు వేదికగా చేసుకున్నారని, సాయంత్రాలు అక్కడ పార్టీలు జరుగుతాయని.. మద్యం, ముక్క అంతా అక్కడే అని ఆ పత్రిక పేర్కొంది. అంతే కాదు..ఆ ప్రభుత్వ కార్యాలయంలోనే బొత్స శ్రీనివాసరావు మకాం పెట్టారు. అక్కడే ఆయన పడక కూడా! పార్టీలు అయిపోయిన తర్వాత ఆయన అక్కడే నిద్ర పోతుండటానికి సంబంధించి ఫొటోలు ప్రచురితం అయ్యాయి.
ఎంత ఆయన అన్న మంత్రి అయితే మాత్రం.. ప్రభుత్వ ఉద్యోగి హోదాలో ఉండి, సొంత కార్యాలయాన్ని ఆయన ఇలా విందుకు, మందుకు వేదికగా మార్చుకోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థి మీడియాకు బొత్స సత్తిబాబు తమ్ముడు అవకాశం ఇవ్వడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అసహనం వ్యక్తం అవుతూ ఉంది. మద్య రహిత సమాజం అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతుంటే.. ఇలా ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసునే ఇలా బార్ గా మార్చేసుకోవడం కచ్చితంగా విమర్శల వాడి పెంచే అంశమే. బొత్స సత్తిబాబు తమ్ముడి తీరుతోనే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడటం గమనార్హం. మరి దీన్ని బొత్స ఎలా సమర్థించుకుంటారో.. తమ్ముడు తనవాడు కాబట్టి.. అలాంటి పనులు చేయడం తప్పులేదని అంటారో ఏమో!