పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే పనుల్లో మరో ప్రధాన అంకం పూర్తయింది. ప్రాజెక్ట్ స్పిల్ వే కు గడ్డర్ల అమరిక పూర్తయింది. ప్రపంచంలోనే భారీ స్పిల్ వే గా పోలవరం రికార్డు కెక్కింది. అదే స్థాయిలో ప్రపంచంలోనే భారీ గడ్డర్లను ఈ స్పిల్ వే పూర్తి చేయడానికి వినియోగించారు.
గడ్డర్ల ప్రత్యేక ఏంటి..?
స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణంలో గడ్డర్ల వ్యవస్థ కీలకం. ఇక పోలవరం విషయానికొస్తే.. పోలవరం స్పిల్ వేలో ఉపయోగించిన ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు. దీని తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించారు. ఒక్కోగడ్డర్ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు ఉంటాయి. స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణంలో మొత్తం 192 గడ్డర్లను వినియోగించారు. ఈ 192 గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగించడం విశేషం. స్పిల్ వే పై గడ్డర్లు, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం పూర్తవుతుంది.
మేఘా పనితీరు ఘనం..
పోలవరం ప్రాజెక్ట్ లో అతి కీలకమైన స్పిల్ వే నిర్మాణంలో గడ్డర్ల అమరికను ఏడాది తిరిగేలోగా పూర్తి చేసింది మేఘా నిర్మాణ సంస్థ. ఏడాది క్రితం.. అంటే సరిగ్గా పిబ్రవరి-17-2020న గడ్డర్ల తయారీని మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రారంభించింది. ఫిబ్రవరి-20-2021 నాటికి స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమరిక పూర్తయింది.
కరెక్ట్ గా చెప్పాలంటే గడ్డర్లను స్పిల్ వే పిల్లర్లపై అమర్చడాన్ని జులై-6-2020న లాంఛనంగా మొదలు పెట్టారు. ఆ తర్వాత టార్గెట్ పెట్టి కేవలం 60 రోజుల్లోనే 192 గడ్డర్లను స్పిల్ వే పై అమర్చి రికార్డు సృష్టించింది మేఘా ఇంజినీరింగ్ సంస్థ. గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్లను వినియోగించడం మరో విశేషం.
నీటి పారుదల శాఖ అధికారులు, మేఘా సంస్థ.. పక్కా ప్రణాళికతో పనిచేసి వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లను అమర్చారు. గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్, గడ్డర్ల అమరిక పూర్తి చేసి రికార్డు సృష్టించిది మేఘా సంస్థ.